ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ సూచించారు. మంగళవారం చిన్నకోడూరు రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. యాసంగి సీజన్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం, భూగర్భ జలాల కొరతను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జయంత్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీకాంత్, నవీన్, కమిటీ సంచాలకులు భూపతిరెడ్డి, సలీమ్, అశోక్, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సందబోయిన పరశురాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల రాజేష్, గొట్టిపర్తి చంద్, పంతం శ్రీనివాస్, అల్లీపూర్ ఉపసర్పంచి కొలన్పాక శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, కోరిమి రాజు, రెడ్డి మహేందర్‌రెడ్డి తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.











