నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఇళ్ల మంజూరు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టానని, ఏడాది లోపు 12 కోట్ల రూపాయల నిధులతో దీనిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం మండలంలోని సిరాల గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఐకెపి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. భారీ వర్షాల కారణంగా సిరాల ప్రాజెక్టు కట్ట తెగిపోయినప్పుడు తాను అక్కడికి వెళ్లి పరిశీలించానని, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పనులు పూర్తి చేయించానని ఆయన తెలిపారు. గత పదేళ్ల కాలంలో అప్పటి పాలకులు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. హమ్ పథకం కింద నియోజకవర్గంలో మొదటి దశలో 230 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రాబోయే రెండేళ్లలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఇళ్ల మంజూరు జరగకపోవడంతో ప్రతి గ్రామం నుండి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని, ప్రభుత్వం మొదటి దఫాలో 3500 ఇళ్లు మంజూరు చేసి, రెండవ దశలో కేవలం 1000 మాత్రమే మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ, పేదల కోసం తన కోటాలో ఇళ్లు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గ్రామస్తుల కోరిక మేరకు సిరాల ప్రాజెక్టు ద్వారా రబీ పంటకు సాగునీరు అందించే విషయంపై అధికారులతో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యా, వైద్యం, సాగునీరు అందించడమే ధ్యేయంగా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ, అందరికంటే ఎక్కువ నిధులు సాధించగలిగానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తో పాటు, ఎంపీవో ప్రదీప్, ఏపీఎం రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, సర్పంచులు పండిత్ రావు పటేల్, సుష్మరెడ్డి, రాజమణి శ్రీనివాస్, మారుతి, సుధాకర్, నాయకులు సదాశివ్, బాలాజీ పటేల్, మోహన్ పటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు.












