కుంటాలలో శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి ఉత్సవంలో ఇందూరు విభాగ్ సహా ప్రచారక్ మీసరి ప్రకాష్ మాట్లాడుతూ, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా, చెడుపై మంచి సాధించిన విజయానికి శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత రాక్షస సంహారాన్ని ఈ పర్వదినం గుర్తుచేస్తుందని అన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని సంస్థలు, వ్యక్తులు విదేశాల నుండి అక్రమంగా నిధులు పొందుతూ కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
మన దేశం సుసంపన్నమైన సంస్కృతి, ఆధ్యాత్మికత కలిగిన పుణ్యభూమి. అందుకే ప్రాచీన కాలం నుండి ఎందరో విదేశీ ఆక్రమణదారులు, మొఘలులు, బ్రిటీష్ వారు మన దేశంపై దండయాత్రలు చేశారు. పరాయి పాలకులు మన దేశ సంపదను దోచుకోవడమే కాకుండా మన సంస్కృతిని, ఆలయాలను, విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పరాయి పాలకుల దండయాత్రల వల్ల మనం కోల్పోయిన స్వేచ్ఛను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో దేశంలో అలాంటి పరిస్థితి మళ్లీ ఎదురుకాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ 1925లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. హిందూ ధర్మం ఎల్లప్పుడూ సర్వేజనా సుఖినోభవంతు అనే భావనను బోధిస్తుంది. అన్ని మతాలను గౌరవించే తత్వమే మన ప్రత్యేకత. అయితే నేటికీ కొన్ని విచ్చిన్నకర శక్తులు, కుహానా సెక్యులరిస్టులు హిందూ సమాజాన్ని బలహీనపరచడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, మన సాంస్కృతిక మూలాలను దెబ్బతీసేందుకు స్వేచ్ఛ పేరుతో రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేస్తున్నాయని మీసరి ప్రకాష్ ఆరోపించారు.
దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని సంస్థలు, వ్యక్తులు విదేశాల నుండి అక్రమంగా నిధులు పొందుతూ వ్యూహాత్మక కుట్రలు పన్నుతున్నాయని ఆయన అన్నారు. హిందూ సమాజం ఐక్యంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందని, దేశభద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే శక్తులను యువత ధైర్యంగా ఎదుర్కొనే చైతన్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. కొందరు యువకులు సోషల్ మీడియా దుష్ప్రభావాలు, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలు మరియు అసాంఘిక కార్యకలాపాల వల్ల పెడదోవ పడుతున్నారని, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న నిరసనల్లో భారత్‌పై వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ శక్తులు, హిందూ వ్యతిరేకులు యువతను రెచ్చగొట్టి తమ పావులుగా వాడుకుంటున్నారని మీసరి ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత శక్తిని సన్మార్గంలో నడిపించడం, వారిలో దేశభక్తి, శారీరక దారుఢ్యం, నైతిక విలువలను పెంపొందించడం ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. యువత చెడు మార్గాలను వీడి దేశం నిర్మాణాత్మక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, తమ మేధస్సును, శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు.
భారతదేశం మళ్ళీ విశ్వగురువు స్థానాన్ని పొందడానికి ఆర్ఎస్ఎస్ గత 101 సంవత్సరాలుగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సకరపు గజేందర్, జిల్లా గోసేవా ప్రముఖ్ కొత్తకాపు నారాయణ, సర్పంచ్ జక్కుల గజేందర్, ఉప సర్పంచ్ వెంకట రమణ, ఖండ సద్భావన ప్రముఖ్ హరి ప్రసాద్, ఖండ బౌద్దిక్ ప్రముఖ్ బండారి గజేందర్, తాటి శివ, చరణ్, రాజు, శ్రావణ్, గ్రామ ప్రజలు మరియు తదితర స్వయంసేవకులు పాల్గొన్నారు.











