ఇందూరు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడి మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ ఉదయం అమ్మవారి చిత్రపటాన్ని పూలతో అలంకరించి పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని అలంకరించి, తమ ఇళ్లలోనే పూజలు, నైవేద్య సమర్పణ చేపట్టారు.
అనంతరం భక్తితో అమ్మవారిని కొలిచి, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నవరాత్రుల సందర్భంగా ఇళ్లలోనే ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతూ, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడి మహిళలు తెలిపారు. అమ్మవారి కృపతో కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.










