నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదో రోజు అమ్మవారు స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రుల ఐదో రోజున స్కందమాతను ఆరాధించడం సంప్రదాయం. కుమారస్వామికి తల్లి కావడంతో అమ్మవారికి స్కందమాత అనే పేరు వచ్చింది. సింహవాహనంపై కొలువుదీరిన అమ్మవారు ఒడిలో కుమారస్వామితో, చేతుల్లో కమలాలతో భక్తులకు దర్శనమిస్తారు. స్కందమాతను పూజిస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఈ సందర్భంగా అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలతో బాసర క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.










