కామారెడ్డి పట్టణంలోని ఆర్కే విద్యాసంస్థల ఆధ్వర్యంలో మహాలయ అమావాస్యను పురస్కరించుకొని శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు తీరొక్క రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. అమ్మవారి రూపం, చంద్రవంక ఆకృతుల్లో బతుకమ్మలను తీర్చిదిద్ది తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఎస్ఆర్కే కళాశాల విద్యార్థినులు ఆర్కే కళాశాలకు చేరుకొని సంయుక్తంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి విఆర్కే కళాశాల మీదుగా ఆర్యానగర్ కాలనీ పార్కుకు చేరుకొని, స్థానిక మహిళలతో కలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ వేడుకలకు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఉప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్కే విద్యాసంస్థల ప్రధాన కార్యనిర్వహణాధికారి డాక్టర్ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు, విద్యార్థినులు, కాలనీవాసులు పాల్గొన్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ఆర్యానగర్ కాలనీ కౌన్సిలర్ సుజిత భరత్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలకు తమ విద్యాసంస్థల్లో ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థినులకు వివరిస్తూ, ప్రకృతిని పూజించాలే తప్ప దానికి ఎలాంటి హాని కలిగించకూడదని సూచించారు. అనంతరం విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేసిన అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు.
ఆర్కే విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Share:

సారాంశం
విద్యార్థినుల ఆటపాటలతో సందడిగా కళాశాల ప్రాంగణాలు
ముఖ్య విషయాలు
- కామారెడ్డి పట్టణంలోని ఆర్కే విద్యాసంస్థల ఆధ్వర్యంలో మహాలయ అమావాస్యను పురస్కరించుకొని శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
- ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు.
- కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు తీరొక్క రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు.
- అమ్మవారి రూపం, చంద్రవంక ఆకృతుల్లో బతుకమ్మలను తీర్చిదిద్ది తమ సృజనాత్మకతను చాటుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,799వ్యూస్










