నిజామాబాద్ జిల్లా పరిధిలోని మెండోరా మండలం, దూదిగాం సీఎస్ఐ బాలబాలికల వసతి గృహంలో విద్యార్థుల తల్లిదండ్రులతో అక్టోబరు 10న ఒక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సీఎస్ఐ ఇన్చార్జి, కమిటీ సభ్యుడు, చర్చి పాస్టర్ రెవరెండ్ కె. కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కమలాకర్ మాట్లాడుతూ, వసతి గృహంలో నేర్చుకున్న మంచి విషయాలను విద్యార్థులు ఇంటి వద్ద కూడా ఆచరించాలని సూచించారు. తల్లిదండ్రులు, సమాజంలోని వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని, మంచి నడవడికను అలవర్చుకోవాలని తెలిపారు.
వసతి గృహ ఇన్చార్జి కె. పద్మారావు మాట్లాడుతూ, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో సేవాభావం, ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
అనంతరం వసతి గృహ విద్యార్థులకు నిర్వహించిన ఎన్నికల్లో కే. జస్వంత్, షారోన్ విద్యార్థి ప్రతినిధులుగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్లు మానస, రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక కమిటీ సభ్యులు కనకరాజ్, జాన్ వెస్లీ, జ్ఞాని తదితరులు పాల్గొన్నారు.












