నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 89 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలోని వివిధ మండలాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు, అర్హతల పరిశీలన, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ వంటి అంశాలపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రతి దశను పారదర్శకంగా ఆయన సూచించారు. దరఖాస్తుదారులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలని, ఎలాంటి సందేహాలకు తావులేకుండా అవసరమైన స్థాయిల్లో పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించిన సమాచారం, తదుపరి దశల వివరాలను దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిల్లో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హత పత్రాల పరిశీలనను పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే, పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
దరఖాస్తుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భర్తీ చేయిస్తామని చెప్పే వ్యక్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని ఆయన సూచించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, సీడీపీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












