ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఆమ్ ఆద్మీ డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు గౌరవ వేతనం, ఇంటి రుణాలతో పాటు ఆర్థిక భద్రత కల్పించాలని కోరింది.
ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక విధానాలు అవసరమని ఆమ్ ఆద్మీ అభిప్రాయపడింది. బస్ పాసులు, పిల్లల చదువులకు ఫీజు రాయితీలతో పాటు ఆర్థిక భద్రత కల్పించే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరింది.
జర్నలిస్టులు ఎండనకా, వాననకా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ తమ వృత్తికి అంకితమై పనిచేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. వృత్తిపరమైన గుర్తింపుతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
ప్రభుత్వానికి పలు డిమాండ్లు
ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. జర్నలిస్టుల వయస్సు, సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నెలవారీ గౌరవ వేతనం అందించాలని, వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కనీసం 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరింది. సొంత స్థలం ఉన్న జర్నలిస్టులకు ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలు, గృహ రుణాలపై వడ్డీ రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు వర్తింపజేయడంతో పాటు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా లేదా నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరింది. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, అర్హులైన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని పేర్కొంది.
చిన్న పత్రికలు, డిజిటల్ మాధ్యమాలకు గుర్తింపు
చిన్న పత్రికలు, డిజిటల్ మాధ్యమాలు, స్వతంత్ర జర్నలిస్టులకు కూడా గుర్తింపు, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, పరిశోధనాత్మక కథనాలతో సమాజంలో మార్పునకు కృషి చేసే జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేసింది.
జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సమయానికి వేతనాలు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, విధి నిర్వహణలో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు జరిగినప్పుడు వెంటనే స్పందించే రక్షణ వ్యవస్థను తీసుకురావాలని కోరింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టులను కేవలం వార్తలు రాసే వ్యక్తులుగా కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వృత్తి నిపుణులుగా గుర్తించాలని ఆమ్ ఆద్మీ కోరింది. జర్నలిస్టుల సంక్షేమాన్ని కొన్ని రాయితీలకు పరిమితం చేయకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పించే సమగ్ర విధానంగా రూపొందించి, డిమాండ్లను దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కార్యక్రమంలో పాల్గొన్నవారు












