దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను పరిష్కరించాలని ఐజేయూ పిలుపుమేరకు, టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుండి గాంధీ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం అందజేశారు. ఆర్డీవో దేవిదాస్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈ రంగాన్ని సమీక్షించి ఆధునిక యుగానికి అనువైన విధాన సిఫార్సులను రూపొందించడానికి ఒక కొత్త మీడియా కమిషన్ను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
భద్రత, చట్టంపై డిమాండ్
పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రత కోసం ఒక ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమని, స్వతంత్ర, సురక్షితమైన మీడియా వాతావరణం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి పునాది అని అన్నారు. పాత్రికేయులు శారీరక దాడులు, నిర్బంధాలు, ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులను ఎదుర్కొంటున్నారని, వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన, స్వతంత్ర జాతీయ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. 1955, 1958 చట్టాల కింద హామీ ఇవ్వబడిన ప్రత్యేక రక్షణలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.












