మండలంలో 108 అంబులెన్స్‌లో ఈఎంటీగా పనిచేస్తున్న పురాడి సాగర్, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ఇప్పటివరకు 28 సార్లు రక్తదానం చేసిన ఆయన, పలువురు రోగులకు తనవంతు సహాయాన్ని అందించారు.
అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తూనే, మరోవైపు రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గురువారం నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగికి అవసరమైన పాజిటివ్ రక్తాన్ని సాగర్ స్వచ్ఛందంగా దానం చేశారు. రక్తం అవసరమైన సమయంలో స్పందించి, రోగి కుటుంబానికి అండగా నిలిచారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, తన రక్తంలో కొంత భాగాన్ని తెలియని మనిషి ప్రాణాలను కాపాడేందుకు అందిస్తున్న సాగర్ సేవలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. అత్యవసర సేవలతో పాటు రక్తదానం ద్వారా కూడా మానవత్వాన్ని చాటుతున్న సాగర్‌ను పలువురు అభినందించారు.












