భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బహుజన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో, గురువారం సిద్దిపేటలో కార్మికులతో సమావేశం నిర్వహించి, బహుజన వామపక్ష కార్మిక సంఘాల అనుబంధ సిద్దిపేట జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రాజు కొమ్మడ జిల్లా కన్వీనర్‌గా, పుష్పలత సహాయ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాలేరు వేణు, మంత్రి మల్లేశం, మహమ్మద్ నస్రుద్దీన్, బాలరాజు, గద్దల కుమారస్వామి, కడప అంజయ్య, సత్తవ్వ, ఎల్లవ్వ, శ్రీదేవి, మల్లేశంలను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ ఏర్పాటు అనంతరం నాయకులు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దానబోయిన రాజు, దబ్బేట ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.












