భోసి గ్రామంలోని శ్రీ వరసిద్ధి కర్ర వినాయక దేవాలయంలో 2026 నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా, సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రముఖ్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు భోసి గ్రామానికి విచ్చేసి, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, వీడీసీ కమిటీ సభ్యులు, ఆర్మీ జవాన్లు, వివిధ భజన మండళ్ల భక్తులు, ప్రకృతి వ్యవసాయదారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, భోసి గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామమని శ్రీ అప్పాల ప్రసాద్ అన్నారు. ఈ గ్రామంలో కుల, వర్గ బేధాలకు అతీతంగా, ఊరంతా కలిసి హిందూ సమాజం ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనేక సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా గ్రామస్తులు గణేష్ ఉత్సవాలను నిర్వహించడం సమాజానికి ఆదర్శంగా ఉందని తెలిపారు. ఈనాడు దేశంలో కుల, వర్గ, ప్రాంత, భాషా బేధాలతో హిందూ సమాజం విడిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో ఏ మతాలు లేని కాలంలో కూడా మన సనాతన ధర్మం పరిఢవిల్లిందని, ఇది అందరికీ ఆదర్శప్రాయమైన ధర్మమని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, వసుదైవ కుటుంబ భావనను తెలియజేసే ఏకైక ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక సమరసత వేదిక కన్వీనర్ డాక్టర్ శీను నాయక్ మాట్లాడుతూ, హిందూ బంధువులందరూ ధర్మ రక్షణకు ఐక్యమత్యంగా ఉండాలని తెలియజేశారు. నిర్మల్ జిల్లా సామాజిక సమరసత వేదిక కన్వీనర్ శ్రీ ఆసం వార్ సాయినాథ్ మాట్లాడుతూ, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సుజన్ రెడ్డి, శ్రీ వరసిద్ధి కర్ర వినాయక దేవాలయ చైర్మన్ శ్రీ ఉత్తంభాలే రావు, దేవాలయ కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్ శ్రీ సల్ల లక్ష్మణ్, వార్డు సభ్యులు, వీడీసీ కమిటీ సభ్యులు, యువకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు, భోసి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీమతి కారగిరి లక్ష్మీ (కారగిరి ఎంకన్న కుమార్తె) కొత్తగా చేయబోయే హుండీ కోసం శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయం - భోసికి రూ. 51,000/- (యాభై ఒక్క వేల రూపాయలు) విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీమతి లక్ష్మీని దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ ఉత్తం బాలేరావ్, కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ శ్రీ సల్ల లక్ష్మణ్, వార్డు సభ్యులు, వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సన్మానించారు.












