భూముల రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కోరారు. భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఈ వివరాలు తెలిపారు. మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామంలో శుక్రవారం భూముల రీ-సర్వే ప్రక్రియపై రైతులు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, భూముల రీ-సర్వే ద్వారా భూ రికార్డులను పకడ్బందీగా రూపొందించడంతో పాటు, భూ యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రీ-సర్వే ప్రక్రియపై రైతులకు, ప్రజలకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు. భూ రికార్డుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్. రమణారెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












