వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంక్షలు విధించినా, అవి చాలా చోట్ల అమలు కాలేదు. భారీ డీజే శబ్దాలు గుండె, చెవులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శబ్దాల వల్ల కొందరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యపై మరింత అవగాహన అవసరమని సూచిస్తున్నారు.
ఒకప్పుడు వినాయక నిమజ్జన ఊరేగింపు అంటే పాటల సందడి, డప్పుల దరువు ప్రధానంగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో వీటన్నింటినీ మించి వినిపిస్తున్నది డీజే మోత. ఈ ఏడాది వినాయక నిమజ్జనాల సందర్భంగా డీజేల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంక్షలు విధించినా, అవి చాలా చోట్ల అమలు కాలేదు. డీజేల విషయంలో చూసీచూడనట్టు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే సమయంలో నిమజ్జన ఊరేగింపుల్లో డీజే శబ్దాల కారణంగా కొందరు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. సంబరం అంటే సంతోష జ్ఞాపకంగా ఉండాలి, విషాదాల గుర్తుగా మిగలకూడదు.
ఉత్సవాల్లోనే కాదు, ఇతర కార్యక్రమాల్లోనూ డీజేల వల్ల ప్రమాదకర పరిణామాలు సంభవిస్తున్నాయని చాలాకాలంగా వినిపిస్తోంది. అసలు డీజే వల్ల ఏ విధంగా సమస్య వస్తోందో పరిశీలిద్దాం. శబ్ద తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ సురక్షితంగా వినగల సమయం గణనీయంగా తగ్గుతుంది. 80 డెసిబెల్స్ వద్ద వారానికి 40 గంటల వరకు వినడం సురక్షిత పరిమితిలో ఉంటే, 90 డెసిబెల్స్ వద్ద అది నాలుగు గంటలకు, 100 డెసిబెల్స్ వద్ద కేవలం 20 నిమిషాలకు తగ్గుతుంది. అంటే శబ్దం కొద్దిగా పెరిగినా చెవులపై పడే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డీజే శబ్దాన్ని గంటల తరబడి వినడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
డీజే శబ్దం సాధారణ మైక్ శబ్దం కంటే ఎక్కువగా కంగారు పెట్టినట్లు అనిపిస్తుంది. అందులో భారీ యాంప్లిఫయర్లు, సబ్వూఫర్లు ఉపయోగించడం వల్ల తక్కువ ఫ్రీక్వెన్సీ బాస్ ఎక్కువగా ఉంటుంది. ఈ బాస్ కేవలం చెవికి వినిపించడమే కాకుండా శరీరంలో కంపనంలా అనిపిస్తుంది. దానికి తోడు ఒక్కసారిగా పెరిగే శబ్దం, పదేపదే వచ్చే బీట్లు మెదడును కుదిపినట్లుగా అనిపిస్తాయి. ఈ భారీ శబ్దాన్ని శరీరం ఒక ఒత్తిడిగా గుర్తిస్తుంది. దీంతో సింపథటిక్ నర్వస్ సిస్టమ్ చురుకై గుండె వేగం, రక్తపోటు, గుండెపై పనిభారం తాత్కాలికంగా పెరగవచ్చు. ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె జబ్బులు లేదా ఇతర హృదయ సంబంధిత ప్రమాద కారకాలు ఉన్నవారిలో ఈ అదనపు ఒత్తిడి ప్రభావం చూపొచ్చు. డీజే శబ్దం గుండెపై అదనపు ఒత్తిడిని కలిగించే కారకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముందుగా దెబ్బతినేది చెవే
భారీ శబ్దానికి గురైన వెంటనే చాలామందికి చెవుల్లో మోగుడు, చెవులు బిగుసుకుపోయినట్లు అనిపించడం, కొంతసేపు వినికిడి తగ్గినట్లు అనిపించడం జరుగుతుంది. ఒక్కసారిగా వచ్చే అత్యంత భారీ శబ్దం కూడా లోపలి చెవిలోని సున్నితమైన భాగాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాత్రివేళల్లో భారీ శబ్దం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. పదేపదే నిద్రాభంగం కలిగితే మరుసటి రోజు అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంగా అధిక శబ్దానికి గురికావడం ఒత్తిడి, అధిక రక్తపోటు, హృదయ సంబంధిత సమస్యల ప్రమాదంతో సంబంధం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.











