జిల్లా భైంసా పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సమన్వయ నాయకుడు విలాస్ గాదేవర్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వేడుకలు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు.
జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా భైంసాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ చేపట్టిన భద్రతా చర్యలు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగుతోందని ఆయన తెలిపారు.
గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, యువత పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తూ, సంయమనంతో శోభాయాత్ర నిర్వహించుకోవాలని విలాస్ గాదేవర్ సూచించారు. భక్తి, ఆనందోత్సాహాల మధ్య గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్న ప్రతి ఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు.
భైంసా పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ వినాయక నిమజ్జన వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరి సహకారం అభినందనీయమని విలాస్ గాదేవర్ అన్నారు.












