ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక, జల్-జంగిల్-జమీన్ నినాదకర్త కొమురం భీమ్ 86వ వర్తంతి వేడుకలను బోథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాయిసెంటర్ (సాంప్రదాయ ఆదివాసీ పంచాయతీ రాజ్ వ్యవస్థ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఘనంగా నివాళులర్పించిన నాయకులు
ఈ సందర్భంగా రాయిసెంటర్ ప్రతినిధులు, ఆదివాసీ పెద్దలు మరియు స్థానిక ప్రజలు కొమురం భీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా నివాళులర్పించారు. జోడేఘాట్ పోరాటంలో నిజాం నవాబు సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరుడైన భీమ్ త్యాగాలను స్మరించుకున్నారు.
కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి ఆదర్శం
అనంతరం న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ... జల్ జంగల్ జమీన్ నినాదం తో అడవి బిడ్డల హక్కుల కోసం, నిజాం పాలకుల తుపాకీ గుండ్లకు ఎదురోడ్డి నిలిచిన కొమురం భీమ్ పోరాట పటిమ నేటికీ మనకు ఆదర్శం అని అన్నారు. భూమి కొరకు ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి కొమురం భీమ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, మన హక్కులను కాపాడుకుంటూ, రాయిసెంటర్ వ్యవస్థ ద్వారా ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే, భీమ్ ఆశయ సాధన కోసం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ సర్మేడి ఆడేం భీమ్ రావు రాజగోండ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తొడసం భూమన్న, ఉపాధ్యాయులు మాడవి లాలురామ్, పడిగేలా లక్మాన్, రిటైర్డ్ ఉద్యోగి పెందుర్ సోనేరావు, మండడి సంబు, కరత్వాడ సర్పంచ్ దుర్వ విశ్వశ్వర్ రావు, పిప్పల్దారి సర్పంచ్ మెస్రం అనసూయ, పిప్పల్దారి మాజీ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తొడసం గోపాల్, డోంగారి రమేష్, మల్లెపూల సుభాష్, లచ్చన్న దేశం, భీమాలింగు, గోడం రమేష్ తో పాటు గిరిజన సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












