నిర్మల్, 2016-11-09
తెలంగాణలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇళ్ల కేటాయింపుల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా గాజులపేటలోని దివ్యాంగుల కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో విఫలమై, వారి పట్ల చిన్నచూపు చూస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
6000 రూపాయల పెన్షన్లు, వితంతువులకు, వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి మర్చిపోయారని విమర్శించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడం లేదని, 2016 నాటి చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం దివ్యాంగులపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తమ హక్కులు, అవకాశాలపై దృష్టి సారించి 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల జనాభా 20 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకోవాలని, పాలనలో మార్పు తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వం నేను అనే పదానికే ప్రాధాన్యత ఇస్తూ, మనం అనే భావనతో ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పెట్రోల్ పథకాలు వంటివి ఇచ్చేవారని, ప్రస్తుత ప్రభుత్వం అన్నింటినీ పక్కనపెట్టి, తమ హక్కులను కాలరాస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో భూమేష్, రాజేశ్వర్, వెంకటేష్, నిఖిత, పంచపుల ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






