ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే లక్ష్యంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 2041 రోజులుగా పేదలు, అన్నార్తులు, రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రాజన్న ఆలయం వద్ద సుమారు 150 మంది భక్తులకు అన్నదానంతో పాటు స్వీట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో ఎంతోమంది పేదలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని, మనకు ఉన్నదాంట్లో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి పంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దాతలు అందించే ప్రతి రూపాయి ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకు ఉపయోగపడుతోందని తెలిపారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, పితృదేవతల స్మరణ వంటి సందర్భాలలో అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని అన్నారు.
నేటి అన్నదాతలు
ఈ అన్నదాన కార్యక్రమానికి బానాల సాయి త్రిషర్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బానాల రాధిక, వీరభద్రస్వామి, సోదరీమణులు నమ్రత, నక్షత్ర, తాతయ్య, నానమ్మ సహకరించారు. అలాగే గోపన్నగారి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీనివాస్ శర్మ, స్వప్న దంపతులు, కుటుంబ సభ్యులు అన్నదానానికి సహకరించారు.
శాశ్వత దాతల సహకారం
అన్నదాన కార్యక్రమానికి శాశ్వత దాతలుగా జువ్వాడి వెంకటేశ్వరరావు, స్నేహలత, ప్రతాప్, స్వప్న, సంపత్, నగుబోతు రవీందర్, జ్యోతి, గణాచారి సాంబశివ, శైలజ, దేవరాజు, ఉమ, బాలచందర్ రాజు, రామడుగు శ్రీలతతో పాటు వారి కుమారులు, కోడళ్లు ప్రజ్ఞ, శరత్చంద్ర, శిరీష, సాయిచంద్ర, శర్వాణి, రవిచంద్ర దంపతులు సహకరించారు. హైదరాబాద్కు చెందిన చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహకరిస్తున్న ప్రతి దాతకు, ట్రస్ట్ సభ్యులకు, సేవలు అందిస్తున్న కార్యకర్తలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనమందరం చేయి చేయి కలిపి ఆకలి లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటాలని ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, సగ్గు రాహుల్, పసుల శ్రీధర్, మధు, కవిత, గొట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






