నిర్మల్ జిల్లా బాసర గోదావరి తీరంలో, సూర్యేశ్వర శివాలయం సమీపంలో 2015లో అప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రూ.1070 లక్షల వ్యయంతో గోదావరి పుష్కరాల స్నాన ఘట్టాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ శిలాఫలకం ప్రస్తుతం చెత్తాచెదారం, పిచ్చి మొక్కల మధ్య నిర్లక్ష్యానికి గురైంది. దీనిపై గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే 2026 గోదావరి పుష్కరాలకు కేవలం 8 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిలాఫలకాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు, భక్తులు పేర్కొంటున్నారు. శిలాఫలకం చుట్టూ రోడ్డు ఆక్రమణకు గురైనట్లు కనిపిస్తోందని, ప్రైవేట్ హోటళ్లకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లు కూడా అక్కడే ఉన్నాయని వారు తెలిపారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, నిర్లక్ష్యం చేయడం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిర్మల్ కలెక్టర్, బైంసా ఆర్డీవో, బాసర తహసిల్దార్, ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, శిలాఫలకాన్ని పరిరక్షించాలని వారు కోరుతున్నారు. ఆక్రమణలు ఉంటే నిబంధనల ప్రకారం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



