రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులు నిరవధికంగా మూతపడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ మండల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
సీఐటీయూ మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌరసరఫరాల శాఖ, నిఘా మరియు అమలు విభాగం, ప్రత్యేక దళాల అధికారులు రైస్ మిల్లులపై చేస్తున్న దాడులు, వేధింపులను వెంటనే నిలిపివేయాలని కోరారు.
కస్టమ్ మిల్లింగ్ బియ్యం బకాయిల వసూలు పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలపై మిల్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో రెండు శాతం లోపే బకాయిల సమస్య ఉన్నప్పటికీ, మిగిలిన 98 శాతం మిల్లులను సైతం తప్పుపట్టడం సరికాదన్నారు.
ధాన్యం ప్రాసెసింగ్, నిల్వ సమయంలో తేమ, నూక శాతం తదితర కారణాలతో సహజంగా జరిగే 18 నుంచి 20 శాతం భౌతిక నష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. నిలిచిపోయిన మిల్లింగ్ రాయితీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తనిఖీల్లో పారదర్శకత కోసం అధికారులు ఎంపిక చేసే విధానంలో ప్రభుత్వం కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినప్పటికీ, మిల్లర్ల భద్రత, రైతుల భవిష్యత్తు, కార్మికుల జీవనోపాధి విషయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు.
ప్రభుత్వం మొండివైఖరి వీడి రైస్ మిల్లుల యాజమాన్యాలతో వెంటనే చర్చలు జరిపి, ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ మండల కమిటీ డిమాండ్ చేసింది.












