ఉత్తరాఖండ్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 65కు పైగా సీట్లు గెలిచి, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లక్ష్యంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్ 26వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్‌లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57 స్థానాలు గెలుచుకోగా, 2022 ఎన్నికల్లో 47 సీట్లు సాధించిందని గుర్తుచేశారు. ఈసారి ఆ రెండు విజయాలకంటే ఎక్కువగా 65కు పైగా స్థానాలు సాధించాలని కార్యకర్తలకు సూచించారు.
ఉత్తరాఖండ్ ప్రజల గొంతు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వినిపించాలని అన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఓటు బచావో కార్యక్రమాన్ని అమిత్ షా విమర్శించారు. అది వాస్తవానికి అక్రమ చొరబాటుదారులను కాపాడే కార్యక్రమమని ఆరోపించారు.
ఓటరు జాబితాల నుంచి, దేశం నుంచి చొరబాటుదారులను తొలగించాలని అన్నారు. హల్ద్వానీలో 29 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి మాట్లాడుతుందని, బీజేపీ మాత్రం ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తం చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఉత్తరాఖండ్‌ను సురక్షితమైన, సంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు దేవభూమిని దేశ సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం 380 శాతం వృద్ధి సాధించిందని ఆయన వెల్లడించారు. కొండ ప్రాంతాల నుంచి ప్రజల వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
గతంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నగదుపై ఆధారపడేదని, ఇప్పుడు పరిశ్రమలు, స్థానిక ఆదాయ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, గతంలో చైనా చొరబాట్ల భయంతో సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేశామని చెప్పారు.
2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 వైమానిక దాడులు, 2025 ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ కార్యక్రమం కింద 51 సరిహద్దు గ్రామాల్లో రూ.270 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారని అమిత్ షా గుర్తుచేశారు. 2000లో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఏర్పడిందని, రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు అడ్డంకులు సృష్టించాయని విమర్శించారు.











