మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీఎస్ ఆసుపత్రిలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య సేవలతో పాటు సమాజ సేవలో ఎస్వీఎస్ ఆసుపత్రి యాజమాన్యం అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
వైద్య వృత్తిలో రాణించడంతో పాటు సమాజ సేవను లక్ష్యంగా పెట్టుకుని ఎస్వీఎస్ ఆసుపత్రి యాజమాన్యం అందిస్తున్న సేవలు అభినందనీయమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిరంతరం విధినిర్వహణలో ఒత్తిడికి గురవుతున్నందున తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి జర్నలిస్టు, వారి కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వ్యాధులను ముందుగానే గుర్తించుకోవాలని అన్నారు. మహబూబ్‌నగర్‌లోనే ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఎస్వీఎస్ ఆసుపత్రి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఎస్వీఎస్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కేజే రెడ్డి మాట్లాడుతూ.. నేటి జీవనశైలిలో అధిక ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్, ఎముకలు, నరాల సంబంధిత సమస్యలను కూడా ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని సూచించారు.
మహబూబ్‌నగర్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి సుమారు రూ.80 కోట్లతో రేడియేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ టోకెన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మల మమత, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, కార్పొరేటర్ రామస్వామి, బీసీ సంఘం నాయకుడు మైత్రి యాదయ్య, పాలమూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేంద్రచారి, జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












