రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని ఆయన ఆరోపించారు.
పవన్ కల్యాణ్ మాట కూరలో కరివేపాకేనా? ఆయన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేయడం వెనుక ఆంతర్యమేంటి?: మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9 ( జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఏపీ పేపర్ మిల్లుకు మరింత కాలుష్యానికి దారితీసే అనుమతులు లభించాయనే అనుమానం కలుగుతోందని మేడా శ్రీనివాస్ ఆరోపించారు. 2027 గోదావరి పుష్కరాలను స్వచ్ఛ పుష్కరాలుగా నిర్వహిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. గోదావరిలోకి పేపర్ మిల్లు రసాయన వ్యర్థాలు చేరుతున్నాయనే ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాలపై ప్రభుత్వం జరిమానా విధించినట్లు ప్రకటించిందని, అదే సమయంలో గత కొన్నేళ్లుగా స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన నీటి పన్ను బకాయిల వసూళ్లపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సామాన్యులు నీటి పన్ను చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేసే అధికారులు, భారీగా బకాయిలు ఉన్న సంస్థల విషయంలో ఎందుకు అదే నిబంధన అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని ఆయన ఆరోపించారు. వాయు, జల కాలుష్యాన్ని నియంత్రించకపోతే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. పవన్ కల్యాణ్ పేపర్ మిల్లు కాలుష్యంపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు దానికి పొంతన కనిపించడం లేదని మేడా శ్రీనివాస్ అన్నారు. కాలుష్య నియంత్రణపై ప్రకటనలకు పరిమితం కాకుండా శాసనసభలో సమగ్రంగా చర్చించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తిస్థాయిలో కాలుష్య రహితంగా మార్చాలని కోరారు. పుష్కరాలకు కనీసం మూడు నెలల ముందు పేపర్ మిల్లు కార్యకలాపాలను నిలిపివేసి, వ్యర్థాల విడుదలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మిల్లు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటంతో పాటు న్యాయపోరాటం చేపడతామని మేడా శ్రీనివాస్ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు తిరుపతి వెంకట రవి, పెండ్యాల కామరాజు, కాసా రాజు, సిమ్మా దుర్గారావు, బర్ల ప్రసాద్, డి.వి. రమణమూర్తి, ఎం.డి. హుస్సేన్, దుడ్డే త్రినాథ్, కారుమూరి యుగంధర్, కారుమూరి రామచంద్రుడు, గుడ్ల దుర్గా ప్రసాద్, బసా సోనియా, దోషి నిషాంత్, వర్ధనపు శరత్‌కుమార్, వల్లి వెంకటేష్, కాకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












