పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల గురువారం ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉచిత భోజనం, అల్పాహారం అందించడంతో పాటు, ఉద్యోగ సన్నద్ధతకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందడం ఖర్చుతో కూడుకున్నదని, జిల్లా కేంద్రంలోనే ఈ అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉద్యోగం సాధించేందుకు కృషి చేయాలని, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు తమవంతు సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా ప్రతి అభ్యర్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు. ఉచిత పోలీసు శిక్షణ కార్యక్రమానికి సహకరిస్తున్న వారితో పాటు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత శిక్షణ కోసం దాదాపు 300 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని, వారికి ఒక పూట ఉచిత భోజనం, అల్పాహారం, అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉద్యోగ సన్నద్ధతకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎస్పీ తెలిపారు. పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించామని, బోధనా అనుభవం ఉన్న పోలీసు సిబ్బందితోనూ శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తామని, దేహదారుఢ్య పరీక్షలకు అవసరమైన శిక్షణ కూడా అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత పోలీసు సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












