దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. విద్యార్థులు దేశ సంస్కృతి, సంప్రదాయాలు, గౌరవాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. జగిత్యాల మహిళా స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలో రూ.5.5 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కళాశాలలో ప్రవేశపెట్టిన నూతన విద్యా కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు వినియోగించుకోవడంతో పాటు, ఉపాధ్యాయుల బోధన కూడా ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రూ.కోటి నిధులతో ఉర్దూ ఘర్ భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విద్యార్థినులు ఆత్మస్థైర్యం, మనోబలంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, కౌన్సిలర్ తిరుమలయ్య, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, టి.వి. సూర్యం, రాజు, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగారెడ్డి, సారంగాపూర్ సర్పంచుల ఫోరం ప్రతినిధి సొల్లు సురేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాల ముకుందం, రవీందర్రావు, హరికిషన్రావు, సర్పంచులు శేఖర్, రాజు, ఉపాధ్యాయులు మల్లికార్జున్, సునీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.












