సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఆదివారం రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. గోనెపల్లి, అనంతసాగర్ గ్రామాలకు చెందిన కార్మికుల కుటుంబాలను యూనియన్ నాయకులు పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.
గోనెపల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు, మేస్త్రీ సల్లోజి రాములు, అనంతసాగర్ గ్రామానికి చెందిన మేస్త్రీ మోడీ నరసయ్య కుటుంబాలను యూనియన్ నాయకులు పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, పునాది నుంచి భవనం పూర్తయ్యే వరకు ఎండనక, వాననక రక్తం, చెమట చిందిస్తూ కష్టపడుతున్న భవన నిర్మాణ కార్మికుల సేవలను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఓట్లతో అధికారంలోకి వస్తున్న నాయకులు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
దేశవ్యాప్తంగా భవనాలను నిర్మిస్తున్న కార్మికులకు తగిన గుర్తింపు, భద్రత, సంక్షేమ పథకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని, వయోపరిమితి దాటిన వారికి లేబర్ కార్డును కార్మికుడు జీవించి ఉన్నంతకాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేబర్ కార్డులు ఉన్న కార్మికులు వాటిని రెన్యువల్ చేయించుకోవాలని, కార్డులు లేనివారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023న మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు మండలంలో 56 మంది కార్మికులు మృతి చెందినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు చేరుకు నారాయణ, ఉపాధ్యక్షుడు శంకరయ్య, కోశాధికారి మహంకాళి ఎల్లం, ఉప కోశాధికారి జేరిపోతు రమేష్, కార్యదర్శి మందపల్లి లింగం, వర్కింగ్ ఇన్చార్జి బోనాల లింగం, చెప్పాల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల రమేష్, మెట్ల వేణు, జి. రాజయ్య, నరేష్, గంగాధర్ రాజుతో పాటు రెండు గ్రామాల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.












