తెలంగాణలో గత వారం రోజుల పాటు కురిసిన వర్షాల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నేటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆకాశం, పొడి గాలి ఆవరించాయని ఆయన పేర్కొన్నారు.
నేటి నుంచి వేడి మరింత పెరిగి, చాలా చోట్ల 34 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని బాలాజీ తెలిపారు. అయితే, ఉదయం పూట వాతావరణం చల్లగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
వర్ష సూచన
కర్ణాటక సరిహద్దులో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత గాలుల దిశలో మార్పులతో ఆగ్నేయ తెలంగాణలో, ముఖ్యంగా ఏపీకి సమీపంలో జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వారం రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాలు మొదలైన తర్వాత వాతావరణం చల్లబడింది. అయితే, ఇప్పుడు మళ్లీ వేడి పెరగనుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలుస్తోంది.












