భైంసా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రకు పట్టణం సిద్ధమవుతున్న వేళ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మంగళవారం జరిగే నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిమజ్జన భద్రతలో భాగంగా సోమవారం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధులు, నిమజ్జన మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో భారీ రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా సున్నిత ప్రాంతాలను పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేశారు.
బందోబస్తులో ఒక అదనపు ఎస్పీ, 14 మంది డీఎస్పీలు, సుమారు 50 మంది సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 700 మంది వరకు విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రూట్ మార్చ్ అనంతరం ఎస్పీ జానకి షర్మిల గణేష్ విగ్రహాల నిమజ్జనం నిర్వహించే గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా నిర్వాహకులు సహకరించాలని ఎస్పీ కోరారు. భక్తులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా డీజేలకు సంబంధించి ప్రభుత్వం, పోలీస్ శాఖ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు. శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రూట్ మార్చ్‌లో ఏఎస్పీ సాయి కిరణ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












