బాల్యవివాహాల నిర్మూలన లక్ష్యంగా నిర్మల్ జిల్లా మండలం మాటేగాం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. బాల్యవివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు వివరించారు.
18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు. బాల్యవివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు లేదా బాలల సహాయవాణి 1098కు సమాచారం అందించాలని సూచించారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామస్థాయి కార్యకర్తలు కలిసి మాటేగాం గ్రామాన్ని బాల్యవివాహ రహిత గ్రామంగా కొనసాగించేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టడంతో పాటు బాలికలు విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. అవసరమైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా బాల్యవివాహ రహిత గ్రామ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన ప్రక్రియను గ్రామస్థుల సమక్షంలో నిర్వహించారు. బాల్యవివాహాలను అరికడదాం.. బాలికలను చదివిద్దాం.. వారి భవిష్యత్తును కాపాడుదాం అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి లక్ష్మణ్, మండల పంచాయతీ అధికారి కే. ప్రదీప్ కుమార్, మాటేగాం శిశు అభివృద్ధి పథకం పర్యవేక్షకురాలు శ్రీవల్లి, గ్రామ సర్పంచ్ కె. శ్యామ్ రావు, ఉప సర్పంచ్ బి. శివాజీ, పంచాయతీ కార్యదర్శి కమల, బాలల సహాయవాణి సలహాదారు జి. సుప్రియ, కేసు కార్యకర్తలు జి. పద్మావతి, పి. సుమలత, అంగన్వాడీ కార్యకర్త గంగామణి, ఆశా కార్యకర్త విజయ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.












