మండలం తాడెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై వార్త రాసిన సీనియర్ జర్నలిస్టు బస్వరాజుపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు డీఎల్ మాల లింగన్న డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఉపాధి హామీ పథకంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలను వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టుపై కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన అన్నారు. జర్నలిస్టు బస్వరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, అలాంటి వారిపై ఒత్తిళ్లు తీసుకురావడం, కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని లింగన్న అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. జర్నలిస్టు బసవరాజ్కు న్యాయం జరిగే వరకు అంబేద్కర్ యువజన సంఘం అండగా ఉంటుందని డీఎల్ మాల లింగన్న తెలిపారు.












