నిర్మల్: బుధవారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన సజావుగా జరిగింది. ఇటీవల నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, పోలీసు శాఖ, ఇతర శాఖల అధికారులు, ప్రజలకు వైస్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వైస్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో చర్చించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పురపాలక సంఘం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యం. రవిబాబు, డీఈ హరిభువన్, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












