కామారెడ్డి, 2026-10-04
తెలంగాణలో ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలు 28 క్రీడాంశాల్లో జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలవబోతున్న రాబోయే జాతీయ స్థాయి ఖేలో ఇండియా-2026 క్రీడల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ () స్టేట్ అడ్వైజరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం హైదరాబాద్‌లోని ఒలింపిక్ అసోసియేషన్ భవనంలో జరిగింది.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారులు, మాజీ ఎంపీ శ్రీ ఎ.పి. జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ వేణుగోపాలచారి, కమిటీ కన్వీనర్ శ్రీ బండ ప్రకాష్, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి, అడ్వైజరీ మెంబర్స్ అందరూ పాల్గొని క్రీడల విజయవంతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశ అనంతరం వీరు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, క్రీడా శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరిని కలుసుకుని, క్రీడల నిర్వహణపై తమ అమూల్యమైన సూచనలు, సలహాలు తీసుకున్నారు. అలాగే ఈ అడ్వైజరీ కమిటీలో నూతనంగా ఎన్నిక కాబడిన కామారెడ్డి జిల్లా వాసి, ప్రముఖ విద్యావేత్త, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
సమావేశం ముఖ్య ముఖ్యాంశాలు
రాష్ట్రవ్యాప్తంగా ఖేలో ఇండియా పోటీలు: ఈ ప్రతిష్టాత్మక జాతీయ క్రీడలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, హనుమకొండ, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండలతో పాటు ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ప్రధాన నగరాలలో కూడా కొన్ని క్రీడలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
28 క్రీడాంశాలు - భారీ ఏర్పాట్లు: మొత్తం 28 రకాల క్రీడాంశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా నలుమూలల నుండి 7వేల పైగా మంది విద్యార్థులు, క్రీడాకారులు, కోచ్‌లు రాబోతున్నందున వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంతర్జాతీయ స్థాయి వసతులు, భోజన, రవాణా ఏర్పాట్లు కల్పించాలని కమిటీ నిర్ణయించింది.
ప్రభుత్వాల ప్రత్యేక చొరవ: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, క్రీడా మంత్రివర్యులు ఈ మెగా ఈవెంట్‌ను ఒక ఛాలెంజింగ్ టాస్క్‌గా తీసుకున్నారని చైర్మన్ జితేందర్ రెడ్డి తెలిపారు. అందరి సమన్వయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు మంచి పేరు తీసుకువచ్చేలా, క్రీడాకారులందరికీ మరపురాని అనుభూతిని మిగిల్చేలా ఈ ఖేలో ఇండియా క్రీడలను అద్భుతంగా విజయవంతం చేస్తామని ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

