మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అయితే, ఈ రాజకీయ పోరాటాలన్నింటినీ తుది తీర్పుగా మార్చేది మాత్రం ప్రజల ఓటేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, ప్రజల సమస్యలను పరిష్కరించిన నాయకులకే ఓటరు పట్టం కడతాడని, కేవలం ప్రచార ఆర్భాటాలతో ప్రజల మనసు గెలుచుకోవడం సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.
గంపలో నాయకుల చేష్టలు.. గల్లీ గల్లీలో ఓటర్ల చర్చలు.. ఇలాంటి వారికేనా మేము ఓటేసి గెలిపించింది. ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలే తూకం వేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఓటే తుది తీర్పు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ యుద్ధం.. మధ్యలో ఓటరు మౌన పరిశీలన. హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజా సమస్యలకు దూరమైతే, ఓటరు మర్చిపోడు. ప్రజా ధనంతో వేతనాలు.. ప్రజా సమస్యలపై మాత్రం మౌనం ఎందుకు. ఒకరి పాలనకు తీర్పిచ్చిన ప్రజలు. ఇప్పుడు మరొకరి పనితీరును నిశితంగా గమనిస్తున్నారు. ప్రచారంతో కాదు. పనితీరుతోనే రాజకీయ భవిష్యత్తు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అసలు పరీక్ష. మా ఓటు.. మీకు అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా.
ఎన్నికల సమయంలో ప్రజల గడప తొక్కే నాయకులు.. గెలిచిన తర్వాత అదే ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ప్రశ్నలు తప్పవు. రోడ్డు కావాలి.. నీరు కావాలి.. ఉద్యోగం కావాలి.. వైద్యం కావాలి.. రైతుకు భరోసా కావాలి.. యువతకు అవకాశాలు కావాలి. ప్రజల అవసరాలు ఇవి. రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కాదు. ఎవరు ఏం మాట్లాడారు అన్నదానికంటే.. ఎవరు ఏం చేశారు అన్నదే ఓటరు లెక్క. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు.. రేపు పోలింగ్ బూత్‌లో నిర్ణయిస్తారు. ఓటరు తీర్పు ఆలస్యం కావచ్చు.. కానీ తప్పదు. నాయకుల చేతిలో అధికారం ఐదేళ్లు ఉండొచ్చు.. కానీ ఆ అధికారానికి తాళం చెవి మాత్రం ఎప్పటికీ ప్రజల చేతిలోనే ఉంటుంది. మాటలతో కాదు.. పనితీరుతో ప్రజల మనసు గెలుచుకున్న వారినే ఓటరు మళ్లీ ఆదరిస్తాడు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల వేడి లేకపోయినా.. రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆందోళనలు చేపడుతుండగా.. అధికార పక్షం కూడా ప్రతిపక్షాల తీరుపై తీవ్రంగా స్పందిస్తోంది. ఈ రాజకీయ పోరాటాన్ని గమనిస్తున్న అసలు శక్తి ఎవరు.. ప్రజలే..
ఎన్నికల సమయంలో ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు ఇప్పుడు వారి పనితీరును నిశితంగా గమనిస్తున్నారన్న చర్చ గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు వినిపిస్తోంది. ఓటు వేసిన ప్రజలే.. ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు.. ఎన్నికల ముందు అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్తారు. మీ కోసం పనిచేస్తాం.. మీ సమస్యలు పరిష్కరిస్తాం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, అంటూ హామీలు ఇస్తారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. ప్రజల మధ్యకు వెళ్లే సమయం తగ్గి, రాజకీయ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, పరస్పర విమర్శలు పెరిగితే మాత్రం ప్రజల్లో అసంతృప్తి సహజంగానే పెరుగుతుంది. ప్రజల ప్రశ్న ఒక్కటే....మా ఓటుతో గెలిచిన తర్వాత.. మా సమస్యలు ఎవరు వింటారు. ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారుతోంది.












