గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై 24 గంటల పాటు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం1968లోని సెక్షన్ 20 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, స్టార్ హోటళ్లలో ఉన్న బార్లు, అధికారికంగా నమోదైన క్లబ్బులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
సంబంధిత మద్యం దుకాణాలు, బార్ల నిర్వాహకులు నిర్ణీత సమయాల్లో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.












