నిజామాబాద్, 8 September
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో ప్రజలు, గులాబీ సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడులు, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కేసీఆర్ చావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను నిరసిస్తూ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులను నిరసిస్తూ ఆర్మూర్ లో ప్రజల నుంచి తీవ్ర అగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్మూర్ పట్టణంలో మంగళవారం గులాబీ సైన్యం కదం తొక్కింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ లపై జరిగిన దాడులు ఖండిస్తూ వేలాది మంది మహిళలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై మహిళలు మండిపడ్డారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నాయకత్వంలో పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో రాస్తారోకో కూడా నిర్వహించారు.
ఇది అభినవ కాంగ్రెస్ దుశ్వాసన రాజ్యం అని, తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో దుశ్వాసన పర్వం పరాకాష్టకు చేరిన కాంగ్రెస్ అధికార గర్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఘటనలను ఖండిస్తూ ఆర్మూర్ లో నిర్వహించిన నిరసన ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు కాంగ్రెస్ లు ఉన్నాయని, ఒకటవది మొదటి నుంచి పార్టీనే నమ్ముకొని పాతుకుపోయిన నేతలున్న పాత కాంగ్రెస్ కాగా రెండవది పచ్చ పార్టీ నుంచి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వచ్చి అధికారం వెలగబెడుతున్న రోత కాంగ్రెస్ అని ఆయన ఎద్దేవా చేశారు. దుశ్వాసనులు, కీచకులు, రాక్షసులు ఉన్న రోత కాంగ్రెస్ కౌరవసభలో పాత కాంగ్రెస్ నేతలు కండ్లుండి చూడలేని ధృతరాష్ట్రులుగా మిగిలిపోయారన్నారు.
చీరెలు లాగుతారా ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి, పోలీసు రాజ్యం నడుపుతున్నావా అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న దుష్ట దుర్యోధనుడి ఆదేశాల మేరకే పోలీసు దుశ్వాసనులు రెచ్చిపోయారన్నారు. మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు.
మంత్రులుగా పనిచేసిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీజు రియింబర్స్ మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా బీఆర్ఎస్ గొంతు నొక్కారన్నారు. వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు బట్ట బయలవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందన్నారు. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన సునీతాలక్ష్మారెడ్డి పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్శాసన పర్వం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి తనకు తెలిసిన అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలను మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. తాతా మధు తిట్టిండు, నవీన్ రెడ్డి కొట్టిండు అని స్వయంగా రేవంత్ రెడ్డే సరికొత్త డ్రామాకు తెరలేపి వారిని అక్రమంగా అరెస్టు చేయించారని ఆయన ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారన్నారు.












