మురసు తుపాను కారణంగా సముద్రంలో అలజడి రేగడంతో, తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు మునిగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా బోటు ప్రమాద వివరాలను ఉప ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.
బోటు ప్రమాదానికి గురైన సమయంలో 9 మంది మత్స్యకారులు అందులో ఉన్నారని, ఇప్పటివరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదని కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో, గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి, వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.
తుపాను హెచ్చరికల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. సముద్రంలో అలజడులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

