గల్ఫ్ మరియు ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ మందా భీం రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పలు గల్ఫ్ కార్మిక సంఘాలు, ప్రవాస సంఘాలు, ఎన్నారై అసోసియేషన్లు, అంతర్జాతీయ డయాస్పోరా సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం స్థాపించి, మూడు దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వలస కార్మికుల సమస్యలపై ఆయన నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అంతర్జాతీయ కార్మిక, వలస సంక్షేమ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, ప్రవాస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ వలస కార్మికుల సమస్యలు, వారి కుటుంబాల సంక్షేమం, పునరావాసం, భవిష్యత్తు భద్రత వంటి అంశాలపై మందా భీం రెడ్డి అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి పలు సూచనలు, ప్రతిపాదనలు సమర్పిస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు వివిధ ప్రవాసి సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంస్థలు సాగించిన నిరంతర కృషి ఫలితంగా తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏర్పాటు కావడం, గల్ఫ్ వలసలపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గల్ఫ్ వలస కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సంక్షేమ నిధి, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం, పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, సురక్షిత వలస విధానాలను అమలు చేయాలని ఆయన పలు సందర్భాల్లో ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మందా భీం రెడ్డి గారికి గల్ఫ్ కార్మికుల సమస్యలు, అంతర్జాతీయ వలస విధానాలు, కార్మిక హక్కులు, ప్రవాస కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై విస్తృతమైన అనుభవం ఉంది.
మూడు దశాబ్దాలుగా ప్రవాసుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తికి ప్రజాసేవా రంగంలో మరింత విస్తృతమైన బాధ్యతలు కల్పించడం ద్వారా వలస కార్మికుల సమస్యలకు విధానపరమైన పరిష్కారాలు లభించే అవకాశాలు మెరుగుపడతాయని పలు సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో ప్రజాసేవా విభాగం నుంచి శ్రీ మందా భీం రెడ్డి గారికి అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత పెద్దలకు గల్ఫ్ సంఘాలు, ప్రవాసి సంఘాలు, ఎన్నారై అసోసియేషన్లు, డయాస్పోరా సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒక వ్యక్తికి పదవి కల్పించడం మాత్రమే కాదు, లక్షలాది మంది వలస కార్మికుల సమస్యలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడమే ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గల్ఫ్ కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రత, గౌరవప్రదమైన జీవితం కోసం మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న మందా భీం రెడ్డి గారికి ప్రజాసేవా రంగంలో తగిన గుర్తింపు లభించాలని వివిధ ప్రవాసి సంస్థల ప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు. జై ప్రవాసి జై కార్మిక లోకం







