ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వారిపై పోలీసులు, కేంద్ర బలగాలు బలప్రయోగానికి దిగాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసి బస్సుల్లో కుక్కి తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సహా పలువురు నేతలు ఉన్నారు.

మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన వామపక్షాల మార్చ్‌ను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు రోడ్డుపై శాంతియుతంగా బైటాయించారు. ప్లకార్డులను చేతబూని సీఈసీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా మినహాయించబడిన వారందరినీ చేర్చాలని, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై 2023 చట్టాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల బలప్రయోగం
అయితే ఈ నిరసనను కొనసాగించేందుకు అనుమతించని పోలీసులు, కేంద్ర బలగాలు వామపక్ష నేతలను, కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వృద్ధులను కూడా చూడకుండా పోలీసులు దారుణంగా, అమానవీయంగా వ్యవహరించారని వామపక్ష నేతలు విమర్శించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆర్. అరుణ్‌కుమార్, సీనియర్ నేతలు బృందా కరత్, సుభాషిణి అలీ, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, అఖిల భారత కిసాన్ సభ ట్రెజరర్ పి. కృష్ణప్రసాద్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ దినేశ్ వార్ష్ణి, నిషా సింధు, సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు సుచేత దే, శ్వేతా రాజ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నాలుగు బస్సుల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ బస్సులను అడ్డుకున్న ఎంపీలు డాక్టర్ వి. శివదాసన్, ఎ.ఎ. రహీంలను కూడా పోలీసులు బలప్రయోగంతో అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ శివదాసన్‌ను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు.
కమిషన్‌ను కబేళాలగా మార్చారు: ఎంఏ బేబీ
పోలీసుల చర్య అనంతరం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యానికి కబేళాలుగా మార్చారని విమర్శించారు. దేశ ప్రజలను ఓటర్ల జాబితాలో చేర్చాల్సిన ఎన్నికల కమిషన్ అందుకు విరుద్ధంగా ఓటర్ల పేర్లను తొలగించే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఓటర్ల పేర్ల తొలగింపునకు బాధ్యత వహిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.