దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ దాదన్నగారి విట్టల్‌రావు స్వాగతించారు. ఈ తీర్పు బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విజయమని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రజల తరఫున హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ బీఫామ్‌పై గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని విట్టల్‌రావు తప్పుబట్టారు. ఒక పార్టీ బీఫామ్‌పై ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత మరో పార్టీలో చేరడం ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారడం సరికాదని విమర్శించారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానం నాగేందర్‌కు చెంపపెట్టు లాంటిదని విట్టల్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టడం కీలక పరిణామమని, ఈ తీర్పు స్పీకర్‌కు చరిత్రలో నిలిచిపోయే మచ్చ లాంటిదని అన్నారు. 2023 నుంచి అనర్హత వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. తీర్పు ప్రతిని అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తోందని, ఈ తీర్పు ఆ పోరాటానికి విజయమని విట్టల్‌రావు పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో చేరిన ఎమ్మెల్యేలు కోర్టు తీర్పుల కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజల తీర్పుతో గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు.












