రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులకు పింఛన్లు వర్తింపజేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జిల్లా రైల్వేకోడూరులోని ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులకు పింఛన్లు వర్తింపజేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జిల్లా రైల్వేకోడూరులోని ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నంద్యాల సరోజనమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 11,500 మంది అంగన్వాడి కార్యకర్తలు, 7,000 మంది సహాయకులకు వస్తున్న జీతం జీవనానికి సరిపోవడం లేదని అన్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, కనీసం నెలకు రూ. 36,000 ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ ఎలా సాధ్యమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని ఆమె కోరారు. అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులతో పాటు వారి కుటుంబాలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అందరికీ పింఛన్లు వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు కే నిర్మల, కార్యదర్శి వై విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












