ప్రజా సమస్యలను, అధికారిక అవినీతిని వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి, వేధిస్తున్న తీరు హేయమైనదని బహుజన సమాజ్ పార్టీ () జిల్లా యువ నాయకులు రేంజర్ల సుశీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లా మండలం తాడెం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించిన సీనియర్ జర్నలిస్ట్ బస్వరాజ్పై తప్పుడు కేసులు పెట్టి, పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రాచరిక పాలనకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.
సమాజంలో తప్పులను ఎత్తిచూపే నిజమైన జర్నలిస్టుల గొంతు నొక్కుతూ, పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ, అక్రమంగా డబ్బు తీసుకుంటూ తప్పులను కప్పిపుచ్చే అవినీతిపరులకు కొమ్ముకాసే సంస్కృతి పెరిగిపోవడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని సుశీల్ కుమార్ అన్నారు. పాలకుల అడుగులకు మడుగులొత్తే వారికి దాసోహం అనే వారికి కాలం చెల్లిందని, నిర్భయంగా నిజాలు రాసే జర్నలిస్టులను వేధించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపరుల రాజ్యం ఎప్పటికీ సాగదని హెచ్చరించారు. సమాజంలో నిజాలు రాసే గొంతులే లేకపోతే, అణగారిన వర్గాల గొంతుక వినిపించేవారే కరువవుతారని సుశీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిఘా ఉంచే విలేకరులు లేకపోతే ఫోర్త్ స్టేట్ (నాల్గో స్తంభం) మనుగడే కోల్పోతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, నిజం కోసం నిర్భయంగా కలమెత్తడమే మీడియాకు ఉన్న నిజమైన గొప్పతనం అని, నిజమైన జర్నలిజానికి, నిర్భయంగా రాసే నిజాయితీపరులకు అండగా నిలవడమే మన బాధ్యత అని తెలిపారు.
ప్రజల కోసం, నిజం కోసం నిర్భయంగా కలమెత్తిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ వెనుక తాను ఎప్పుడూ అండగా ఉంటానని సుశీల్ కుమార్ తెలిపారు. నిజాయితీగా, నిర్భయంగా రాసే ప్రతి జర్నలిస్టుకు తమ పార్టీ తరపున, తన వ్యక్తిగత తరపున ఎప్పటికీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన సగర్వంగా ప్రకటించారు. తప్పు చేసిన ఏ ఒక్కడినీ, ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జర్నలిస్ట్ బస్వరాజ్పై బనాయించిన బూటకపు కేసులను వెంటనే బేషరతుగా ఎత్తివేయాలని, ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిన బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రేంజర్ల సుశీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులపై కక్షసాధింపులను తీవ్రంగా ఖండిస్తున్నామని, అవినీతిపరుల రాజ్యం ఎప్పటికీ సాగదని హెచ్చరించారు.












