రాష్ట్ర శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, అసత్య ఆరోపణలు చూస్తే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గౌరవ సభ స్థాయి నుంచి కౌరవ సభ స్థాయికి దిగజార్చినట్లు ప్రజలకు అర్థమైందన్నారు.
మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, ఒక నిఖార్సైన ఉద్యమకారుల కుటుంబాన్ని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఎందుకు కేసీఆర్ కుటుంబంపై కక్ష గట్టారు అసలు ఎప్పటికీ రాదనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించినందుకా తెచ్చిన తెలంగాణను పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం లో దేశంలోనే అగ్రగామిగా నిలిపినందుకా తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇక మీ ఆటలు సాగవని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ఫాంహౌస్‌పై విచారణ కక్షసాధింపు చర్యే
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేయడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని, విచారణ జరపకపోతే అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్థాయిలో బ్లాక్ మెయిల్ చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ తమ తాతల జాగీరా అని నిలదీశారు. కేసీఆర్ ఫాంహౌస్ ఆధీనంలో 700 ఎకరాలు ఉందని చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. కేటీఆర్, హరీశ్ రావులకు వందల ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనడం కూడా అభ్యంతరకరమన్నారు.
ఏడుగురు సోదరుల భూకబ్జాల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ రకమైన డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆయన ఎద్దేవా చేశారు. ఫాంహౌస్, భూములపై విచారణ ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని ఆయన పేర్కొంటూ, కేసీఆర్ కష్టార్జితాన్ని కాజేయాలని కుట్ర చేస్తున్నారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూబకాసురుల అవతారమెత్తి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలను అడ్డుకుంటామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.











