దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ (20) నాణ్యతపై వివాదం మొదలైంది. పెట్రోల్లో నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ వాదనలను ఖండించాయి. కొన్ని నమూనాల్లో 26 నుంచి 31.2 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
అయితే పరీక్షల విధానం, నమూనాల సేకరణ ప్రక్రియలో లోపాలున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం స్పష్టం చేశాయి. కర్ణాటక ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, న్యాయ కొలతల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల నుంచి నమూనాలు సేకరించినట్లు తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలు
వాటిని పరీక్షించగా కొన్ని నమూనాల్లో ఇథనాల్ శాతం 20 శాతానికి మించి ఉన్నట్లు గుర్తించామని, ఇండియన్ ఆయిల్ పెట్రోల్లో 31.2 శాతం, హెచ్పీసీఎల్ పెట్రోల్లో 30.5 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై చమురు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల మైలేజీ తగ్గే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధన పంపులు, ఇంజెక్టర్లు, ఫిల్టర్లు, గొట్టాలు, సీల్స్ వంటి విడిభాగాలపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొన్నారు.
వాహనాలపై ప్రభావం
దేశంలోని వాహనాల్లో అధిక శాతం 20 కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమానికి అనుగుణంగా రూపొందించలేదని ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులకు నష్టపరిహారం అందించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రాన్ని కోరింది.
చమురు కంపెనీల స్పందన
కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలను మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఖండించాయి. దేశవ్యాప్తంగా, కర్ణాటకలోనూ సరఫరా చేస్తున్న 20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన 17021 ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని వెల్లడించాయి. 2023లో సేకరించిన నమూనాలను నిర్దేశిత ప్రయోగశాలల్లో పరీక్షించామని, అక్టోబర్లో జరిగిన తదుపరి తనిఖీల్లో తమ ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండానే నమూనాలు సేకరించారని కంపెనీలు ఆరోపించాయి.
నిబంధనల ప్రకారం ఆరు లీటరు నమూనాలు సేకరించాలి. వాటిలో రెండు బంకు నిర్వాహకులకు ఇవ్వాలి, రెండు కంపెనీ లేదా సంబంధిత శాఖ వద్ద ఉంచాలి. మిగిలిన రెండింటిని అధికారికంగా గుర్తించిన ప్రయోగశాలకు పంపాలి. ఈ ప్రక్రియను సక్రమంగా పాటించలేదని చమురు కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ హై టెక్నాలజీతో కలిసి నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 893 నమూనాలను పరిశీలించినట్లు కంపెనీలు తెలిపాయి. వీటన్నింటిలో ఇథనాల్ శాతం 19 నుంచి 21 మధ్యే ఉన్నట్లు వెల్లడించాయి. కర్ణాటక నుంచి సేకరించిన 56 నమూనాల్లోనూ ఇథనాల్ శాతం 19 నుంచి 20 మధ్య నమోదైందని, సగటున 19.30 శాతం ఉన్నట్లు పేర్కొన్నాయి.

