పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని డిపాల్పూర్ రోడ్డుపై గురువారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు.
ముల్తాన్ నుంచి కసూర్‌కు వెళ్తున్న బస్సు 17 ఎస్పీ స్టాప్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు వాహనం శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ 1122 బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్రేన్లు, భారీ యంత్రాల సహాయంతో సుమారు మూడు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టి వాహనం శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిలో 25 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఎనిమిది మందికి స్వల్ప గాయాలవడంతో అక్కడికక్కడే చికిత్స అందించారు. ప్రమాదం నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, అదనపు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ ఘోర ప్రమాదంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.












