హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ మిర్జా రెహ్మత్ బేగ్‌ను డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో నార్సింగి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోలు ప్రచారం చేస్తామని బెదిరిస్తూ నిందితులు ఆయన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు ఇప్పటికే ఎమ్మెల్సీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. తాజాగా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద నగదు తీసుకునేందుకు వచ్చిన నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో మహ్మద్ మొహ్సిన్ ఖాన్, ఫాతిమా బేగం అలియాస్ రీమా, మహ్మద్ సమీర్, మహ్మద్ జమీర్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్ రెహాన్ ఉన్నారు. వీరిని విచారించగా, నేరం అంగీకరించినట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.4.70 లక్షల నగదు, రెండు ఆటోలు, ఆరు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని నార్సింగి పోలీసులు తెలిపారు.

