రాజమహేంద్రవరం గ్రామీణం, 11 October
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారుల అధికార దుర్వినియోగం, ఈవీఎంల మోసాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జనసేన పార్టీ గెలిచిన స్థానాలపై ప్రత్యేక విచారణకు ఆదేశించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 2024 సాధారణ ఎన్నికల్లో కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాల అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యం పూర్తిగా బలి అయిందని మేడా శ్రీనివాస్ ఆరోపించారు. మోదీ సర్కార్‌కు, వారి మిత్రపక్షాలకు అధికారాన్ని కట్టబెట్టాలనే కుట్ర కోణంలో ఓటును వివిధ మార్గాల్లో దోచుకున్నారని విమర్శించారు.
వీవీప్యాడ్, ఈవీఎంలు, కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సమయంలో ఉపయోగించిన మిషన్లకు, ఓట్ల కౌంటింగ్ సమయంలో కనిపించిన మిషన్లకు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. అనుకూలతను, సందర్భాలను, పరిస్థితులను అధికార దుర్వినియోగంతో తమ కుట్రలకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చుకున్నారని ఆరోపించారు. విధుల నుండి వెళ్లిపోయే ఎన్నికల ముఖ్య అధికారి ముసుగులో, రాబోయే ఎన్నికల ముఖ్య అధికారికి చట్టపరమైన రక్షణ కవచాన్ని మోదీ సర్కార్ ముందే సిద్ధం చేసిందని, జ్ఞానేశ్వర్‌తో ఎన్నికల నేరాలను చేయించిందని మేడా శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల కుట్రలు విఫలం కాకుండా ఫారం-6, 7లను జ్ఞానేశ్వర్ ఇష్టానుసారం ఉపయోగించి సుమారు 13 కోట్లకు పైబడిన ఓట్లను అధికార దుర్వినియోగంతో కుట్రపూరితంగా తొలగించారని తెలిపారు.
2023లోనే ఈ కుట్రకు రక్షణ కవచం ఏర్పాటు చేసే విధంగా, జ్ఞానేష్ కుమార్ వంటి వారు చేసే అధికార దుర్వినియోగ నేరాలకు వెన్నుదన్నుగా, రక్షణ కవచంగా ఉండేలా ఎన్నికల చట్టం 2023 సెక్షన్ 16ను సవరిస్తూ, ఎన్నికల ముఖ్య అధికారి ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, విధుల్లో ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టకూడదనే విధంగా చట్టపరమైన భద్రత కల్పించి, జ్ఞానేష్తో ఎన్నికల నేరాలు చేయించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జ్ఞానేశ్వర్ ముసుగులో ఓటరును వంచించిందని, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జనసేన పార్టీకి మేలు చేసేందుకు తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు పూర్తిగా అక్రమ గెలుపు ప్రకటన అని ఆయన అన్నారు.
మోదీ, జ్ఞానేశ్వర్ ఎన్నికల మోసాలకు కారకులైనప్పుడు, వారికి భజన చేస్తూ తిరిగిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన జనసేన సీట్లలో నిజమెంత అని ప్రశ్నించారు. జ్ఞానేష్, ముకేశ్‌ల అధికార దుర్వినియోగం పవన్ కళ్యాణ్ రాజకీయ అధికార చిరునామాకు కేంద్ర బిందువుగా మారిందని తెలిపారు. ఎప్పటికైనా జ్ఞానేశ్వర్, మోడీలను తాకిన ఓట్ల కుంభకోణ నేరం పవన్ కళ్యాణ్ గెలుపును తాకుతుందనే భయం జనసేన అధినేతను వెంటాడుతుందని అన్నారు. దొడ్డి దారిలో అక్రమ విజయాన్ని కైవసం చేసుకున్న రాజమండ్రి పార్లమెంట్ స్థానంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన నా ఎలక్షన్ పిటిషన్‌ను కాలయాపన జరపకుండా విచారణకు ఆదేశిస్తే అనేక ఎన్నికల నేరాలు, అధికార దుర్వినియోగ చర్యలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని మేడా శ్రీనివాస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గెలిచినట్టు ప్రకటించుకున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలపై ప్రత్యేక విచారణకు ఆదేశించాలని కోరారు.












