హాలీవుడ్ నటుడు క్రిస్ ప్రాట్ మరోసారి జేమ్స్ రీస్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన ది టెర్మినల్ లిస్ట్ వెబ్ సిరీస్ కథను కొనసాగిస్తూ, జాక్ కార్ రాసిన సావేజ్ సన్ నవల ఆధారంగా కొత్త సిరీస్‌ను రూపొందించనుంది. ఈ సిరీస్‌లో మాజీ నేవీ సీల్ స్నైపర్ జేమ్స్ రీస్ పాత్రలో క్రిస్ ప్రాట్ నటించనున్నారు.
ఈ కథలో రీస్‌కు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగత మిషన్ ఎదురవుతుంది. రష్యన్ మాఫియాతో చేతులు కలిపిన ఒక అవినీతి సీఐఏ అధికారి అతడిని హతమార్చేందుకు కుట్ర పన్నుతాడు. మరోవైపు, మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న రీస్‌కు జర్నలిస్ట్ కేటీ బురానెక్, మాజీ సీల్ సహచరుడు రైఫ్ హేస్టింగ్స్ సహాయం చేస్తారు. రష్యన్ గూఢచార సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు అమెరికా ప్రభుత్వంలోనూ ఉన్నట్లు కథనం ముందుకు సాగుతుంది. దీంతో రీస్ మాజీ కమాండోల బృందాన్ని ఏర్పాటు చేసి రష్యన్ మాఫియాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. జాక్ కార్ రాసిన సావేజ్ సన్ నవల, ఆయన టెర్మినల్ లిస్ట్ పుస్తక శ్రేణిలో మూడోది. అయితే, ఈ ప్రాజెక్ట్ ది టెర్మినల్ లిస్ట్ మూడో సీజన్‌గా వస్తుందా లేక ప్రత్యేక వెబ్ సిరీస్‌గా రూపొందుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎంఆర్సీ, సివిక్ సెంటర్ మీడియా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.

