దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విశ్వసనీయత, పారదర్శకతను మెరుగుపరిచేందుకు పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నిర్వహణలో లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యంగా నీట్ యూజీ పరీక్ష వివాదం నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది.
దేశంలో జేఈఈ మెయిన్స్, నీట్ యూజీ, యూజీసీ నెట్, సీయూఈటీ వంటి కీలక పరీక్షలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్వహిస్తోంది. ఏటా సుమారు 1.2 కోట్ల మంది అభ్యర్థులు హాజరయ్యే ఈ పరీక్షల నిర్వహణలో భద్రత, పారదర్శకత అత్యంత కీలకమని పార్లమెంటరీ కమిటీ నొక్కి చెప్పింది. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, గతంలో తలెత్తిన వివాదాలు వ్యవస్థలో మరిన్ని సంస్కరణల అవసరాన్ని సూచిస్తున్నాయని కమిటీ పేర్కొంది.
ప్రశ్నపత్రాల లీకేజీ నివారణకు సూచనలు
పరీక్షల భద్రతను పెంచేందుకు విస్తృతమైన ప్రశ్నల బ్యాంకును రూపొందించాలని, వివిధ అంశాలు, కఠినతా స్థాయులకు అనుగుణంగా ప్రశ్నలను సిద్ధం చేసి, నిరంతరం నవీకరించాలని కమిటీ సూచించింది. పరీక్షకు కొద్ది సమయం ముందు డిజిటల్ విధానంలో ప్రశ్నలను ఎంపిక చేసి, తుది ప్రశ్నపత్రాన్ని రూపొందించడం ద్వారా లీకేజీ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాదం వంటి బాధ్యతలకు ఐఐటీలు, ఎయిమ్స్, ఐఐఎంల వంటి ప్రముఖ విద్యాసంస్థల నిపుణులను వినియోగించాలని, వారి నేపథ్యాన్ని పరిశీలించాలని సూచించింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాలు
నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అవకాశాన్ని కూడా కమిటీ పరిశీలించింది. దీనికోసం దేశవ్యాప్తంగా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత నమూనా పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించాలని పేర్కొంది.
ఎన్టీఏలో సిబ్బంది కొరత
జాతీయ పరీక్షల సంస్థలో సిబ్బంది కొరత కీలక సమస్యగా కమిటీ గుర్తించింది. సంస్థలో మంజూరైన 39 పోస్టులకు గాను 23 మంది అధికారులు మాత్రమే పనిచేస్తున్నారని, 41 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. పరీక్షల నిర్వహణలో నైపుణ్యం, అనుభవం కలిగిన శాశ్వత సిబ్బందిని నియమించాలని, భద్రత, డిజిటల్ వ్యవస్థలు, గణాంక విశ్లేషణ వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరమని తెలిపింది.
పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తినప్పుడు విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు సమర్థమైన వ్యవస్థ ఉండాలని కమిటీ సూచించింది. పరీక్ష రద్దు వంటి పరిణామాలతో నష్టపోయిన అభ్యర్థులకు పరిహారం అందించే అవకాశాన్ని పరిశీలించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట గడువులు విధించాలని సిఫార్సు చేసింది. అక్రమాలకు పాల్పడిన సంస్థల వివరాలతో జాతీయ స్థాయి జాబితా రూపొందించాలని, పరీక్షల భద్రతను స్వతంత్రంగా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించవచ్చని అభిప్రాయపడింది.








