మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
ఉపాధ్యాయుల సమస్యలను రెండేళ్లలో పరిష్కరిస్తామని, పీఆర్సీ, ఇంక్రిమెంట్లపై హామీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యా వ్యవస్థను దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టేందుకు ఉపాధ్యాయుల భాగస్వామ్యం కోరారు.
ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు ప్రభుత్వానికి సహకరించి వెసులుబాటు కల్పిస్తే పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణల ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి దిక్సూచిగా నిలబెట్టేందుకు ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు.
కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీరు అడగకుండానే సమస్యలను సామరస్యంగా పరిష్కరించే బాధ్యత నాది. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఏ విషయంలోనూ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ఇబ్బంది రానివ్వను అని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభసూచకం కాదన్నారు. పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
గత ప్రభుత్వం పదేళ్లలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని సీఎం విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, జీవో 317 సమస్యల పరిష్కారం, పెండింగ్ పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.
విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గత రెండేళ్లలో 80 వేలకు పైగా విద్యార్థుల అడ్మిషన్లు పెరగడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యా రంగం ర్యాంకు మెరుగుపడటంలోనూ ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలిటెక్నిక్ విద్యలో మార్పులు తీసుకొచ్చి రెండేళ్లు సైద్ధాంతిక విద్య, మూడో సంవత్సరం కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇంటర్న్‌షిప్ సమయంలో కార్పొరేట్ సంస్థలు నెలకు రూ.9 వేల వరకు స్టయిఫండ్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.












